నేయం మమ మహీ సౌమ్య! దుర్లభా సాగరామ్బరా । నహీచ్ఛేయమధర్మేణ శక్రత్వమపి లక్ష్మణ ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే సప్తనవతితమస్సర్గః (౬వ శ్లోకము) చిత్రకూటపర్వతము కడకు సైన్యముతో వచ్చిన భరతుని అపార్థము చేసుకొని, అతనిని వధించి శ్రీరామునికి రాజ్యమిప్పిస్తానని క్రోధముతో ఊగిపోతున్న లక్ష్మణస్వామిని శాంత పరచుచూ శ్రీరాముడీ అమృతవాక్కులను కురిపించెను: “ఓ సౌమ్యుడా! లక్ష్మణా! నేను తలచుకుంటే ఈ ప్రపంచాన్నంతా నా పరాక్రమముతో సులభముగా సాధించగలను. కానీ కించిత్ ధర్మము తప్పుట వలన ఇంద్రపదవి వచ్చినా నేను దానిని ఎన్నడూ ఆశించను”. ధర్మముమీద మనకు ఎంత తీవ్రమైన నిష్ఠ ఉండాలో శ్రీరాముడు ఈ శ్లోకము…

సంశ్రుత్య చ తపస్విభ్యః సత్రే వై యజ్ఞదక్షిణామ్ । తాం విప్రలపతాం పాపం యస్యాఽఽర్యోఽనుమతే గతః ॥

— శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే పఞ్చసప్తతితమస్సర్గః (౨౫వ శ్లోకము) శ్రీరాముని అడవులకు పంపుటలో తన ప్రమేయము కొంచమైనా లేదు అని కౌసల్యాదేవి ముందు ఒట్ట్లు పెడుతూ భరతుడు ఈ శ్లోకము చెప్పినాడు: “అట్టి దురాలోచన నాకున్నచో, దైవకార్యమునకు ఆధ్వర్యము వహించే తపస్వియైన బ్రాహ్మణునికి ఇస్తానన్న (ఇవ్వతగినంత) దక్షిణ ఇవ్వని వాడు పొందే మహాపాపమును నేను పొందెదనుకాక”.

పరిపాలయమానస్య రాజ్ఞో భూతాని పుత్త్రవత్ । తత స్తం ద్రుహ్యతాం పాపం యస్యాఽఽర్యోఽనుమతే గతః ॥

— శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే పఞ్చసప్తతితమస్సర్గః (౨౩వ శ్లోకము) శ్రీరాముని అడవులకు పంపుటలో తన ప్రమేయము కొంచమైనా లేదు అని కౌసల్యాదేవి ముందు ఒట్ట్లు పెడుతూ భరతుడు ఈ శ్లోకము చెప్పినాడు: “అట్టి దురాలోచన నాకున్నచో, ప్రజలను తన కన్నబిడ్డలవలే పరిపాలించే రాజునకు ద్రోహము తలపెట్టినవానికి ప్రాప్తించే దుర్గతులు నాకు కలుగుగాక”. కాబట్టి, ప్రజలకు రక్షణకల్పించే వారికి (ఉదాహరణకు ధర్మబద్ధుడైన రాజు) మనమెన్నడూ ద్రోహము తలపెట్టరాదని భరతుని సందేశము.

కారయిత్వా మహత్ కర్మ భర్తా భృత్యమనర్థకమ్ । అధర్మోయోఽస్య సోఽస్యాస్తుయస్యాఽఽర్యోఽనుమతేగతః ॥

— శ్రీమద్రామాయణే అయోధ్యాకాణ్డే పఞ్చసప్తతితమస్సర్గః (౨౨వ శ్లోకము) శ్రీరాముని అడవులకు పంపుటలో తన ప్రమేయము కొంచమైనా లేదు అని కౌసల్యాదేవి ముందు ఒట్ట్లు పెడుతూ భరతుడు ఈ శ్లోకము చెప్పినాడు: “అట్టి దురాలోచన నాకున్నచో, బాగా కష్టపడి పని చేసినా ఆ శ్రమకు తగ్గ పారితోషకము (జీతము) ఈయని యజమాని పోయే దుర్గతికి నేను పోయెదనుగాక”. కాబట్టి, మనమెల్లప్పుడూ మనకు పనులు చేసిపెట్టే వారికి తగిన జీతములు సకాలములో ఈయవలెనని వాల్మీకి మహర్షి బోధ.

ఏకపుత్త్రా చ సాధ్వీ చ వివత్సేయం త్వయా కృతా । తస్మాత్ త్వం పతతం దుఃఖం ప్రేత్య చేహ చ లప్స్యసే ॥

— శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే చతుస్సప్తతితమస్సర్గః (౨౯వ శ్లోకము) “కౌసల్యాదేవి వంటి సాధ్వి యొక్క ఏకైక కుమారుని ఆమెనుండి వేరు చేసిన నీకు ఈ లోకములో, పరలోకములో కూడా కష్టాలు తప్పవు”, అని భరతుడు కైకేయితో చెప్పెను. ఇక మనము నేర్వవలసిన నీతులు: నిష్కారణముగా తల్లి నుండి బిడ్డను వేరుచేయరాదు. అట్లు చేయుట మహాపాపము. పైని వాక్యము మానవులకే కాక, పుత్రేశ ఉన్న అన్ని ప్రాణులకు వర్తించును. ముఖ్యముగా, ఆవులకు పుత్రేశ మిక్కిలి ఎక్కువగా నుండునని శాస్త్ర వాక్కు. మీదుమిక్కిలి,…

కచ్చిన్న పరదారాన్ వా రాజపుత్త్రోఽభిమన్యతే । కస్మాత్ స దణ్డకారణ్యే భ్రూణహేవ వివాసితః ॥

— శ్రీమద్రామాయణే అయోధ్యాకాణ్డే ద్విసప్తతితమస్సర్గః (౪౫వ శ్లోకము) సీతారామలక్ష్మణులు అడవులకు పంపబడినారన్న పిడుగులాంటి వార్త విన్న భరతుడు నేలమీద కుప్పకూలినాడు. ఎట్టకేలకు తేరుకుని, ఏ కారణముగా శ్రీరాముడు ఇంత దారుణమైన శిక్షకు గురి అయినాడు అని తల్లిని ఈ శ్లోకము ద్వారా ప్రశ్నించినాడు. “ఏకారణముగనననూ (తెలిసీతెలియక) శ్రీరామునికి పరదారాభిగమన దోషము కానీ, భ్రూణహత్యాదోషము కానీ, సంభవింపలేదు కదా!” ఈ శ్లోకము ద్వారా మనము గ్రహించవలసిన నీతులు: మన భారతీయులకు పరస్త్రీ తల్లితో సమానము. కాబట్టి పరస్త్రీలను కాంక్షించుట మహాపాపము. గర్భస్థమైన శిశువును…

కచ్చిన్న బ్రాహ్మణధనం హృతం రామేణ కస్యచిత్ । కచ్చిన్నాఢ్యో దరిద్రో వా తేనాపాపో విహింసితః ॥

— శ్రీమద్రామాయణే అయోధ్యాకాణ్డే ద్విసప్తతితమస్సర్గః (౪౪వ శ్లోకము) సీతారామలక్ష్మణులు అడవులకు పంపబడినారన్న పిడుగులాంటి వార్త విన్న భరతుడు నేలమీద కుప్పకూలినాడు. ఎట్టకేలకు తేరుకుని, ఏ కారణముగా శ్రీరాముడు ఇంత దారుణమైన శిక్షకు గురి అయినాడు అని తల్లిని ఈ శ్లోకము ద్వారా ప్రశ్నించినాడు. “ఏకారణముగనననూ (తెలిసీతెలియక) శ్రీరామునికి బ్రాహ్మణధనాపహరణము దోషము కానీ, సంపన్నులను కానీ, దరిద్రునికానీ అనవసరముగా హింసించిన దోషముకానీ, సంభవింపలేదు కదా!” ఈ శ్లోకము ద్వారా మనము గ్రహించవలసిన నీతులు: ధనేశను వీడి వేదాధ్యయనముతో కాలము గడిపే సద్బ్రాహ్మణుని ధనమును…