లక్ష్మీశ్చన్ద్రాదపేయాద్వా హిమవాన్ వా హిమం త్యజేత్ । అతీయాత్ సాగరో వేలాం న ప్రతిజ్ఞామహం పితుః ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే ఏకాదశోత్తరశతతమస్సర్గః (౧౮వ శ్లోకము) శ్రీరాముడు భరతునితోనిట్లనెను: “ఒకవేళ చంద్రునినుండి వెన్నెల దూరమవ్వచ్చును, హిమవత్పర్వతము నుండి మంచు వేర్పడచ్చు, సముద్రము చెలియలకట్టదాటవచ్చు, కానీ నేను మాత్రము నాన్నగారి మాట వమ్ముకానివ్వను”. సత్యముపై శ్రీరామునికిగల స్థిరచిత్తము ఈ శ్లోకముద్వారా వాల్మీకిమహర్షి ప్రకాశింపచేసినారు.

ప్రత్యగాత్మమిమం ధర్మం సత్యం పశ్యామ్యహంస్వయమ్ । భారః సత్పురషాచీర్ణః తదర్థమభిమన్యతే ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే నవోత్తరశతతమస్సర్గః (౧౯వ శ్లోకము) జాబాలి మహర్షికి సమాధానమిస్తూ శ్రీరాముడు ఇట్లనెను: “సత్యమనబడే ఈ ధర్మము అందరికీ కళ్యాణకరమైనది. ఇది అన్ని ధర్మములలోనూ శ్రేష్ఠమైనదిగా నేను దర్శించుచున్నాను. సత్యవాక్పాలముకైనే నేను తపస్వులవలె జటావల్కలములు ధరించి ఇచ్చటికి వచ్చినాను”.

అసత్యసన్ధస్య సతః చలస్యాస్థిరచేతసః । నైవ దేవా న పితరః ప్రతీచ్ఛన్తీతి నః శ్రుతమ్ ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే నవోత్తరశతతమస్సర్గః (౧౮వ శ్లోకము) జాబాలి మహర్షికి సమాధానమిస్తూ ఈ ధర్మబోభకమైన శ్లోకాన్ని చెప్పాడు శ్రీరాముడు: “మాటకు కట్టుబడని చంచల మనస్కుడిచ్చే హవ్యకవ్యాదులవంటి మహాపుణ్యవస్తువులను సైతము దేవతలు, పితృదేవతలు స్వీకరించరని వేదాలు ఘోషిస్తున్నాయి”.

నైవ లోభాన్నమోహాద్వా నహ్యజ్ఞానాత్ తమోన్వితః । సేతుం సత్యస్య భేత్స్యామి గురోః సత్యప్రతిశ్రవః ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే నవోత్తరశతతమస్సర్గః (౧౭వ శ్లోకము)  జాబాలి మహర్షికి సమాధానమిస్తూ సత్యవర్తనముపైన తనకున్న దృఢత్వాన్ని ఆవిష్కరించే ఈ శ్లోకాన్ని చెప్పాడు శ్రీరాముడు: “ (రాజ్య) లోభము వలన కాని, (తమ్ములయందు) మోహము వలన కాని, (ఇతర) అజ్ఞానము వలన కాని, ఇప్పుడు నేను అవివేకివలె  (తండ్రిని సత్యపథమునందు నిలుపుతానన్న) నా ప్రతిజ్ఞను, పూజ్యులైన తండ్రిగారి వాగ్దానమును భంగపరచలేను”.

దత్తమిష్టం హుతం చైవ తప్తాని చ తపాంసి చ । వేదాః సత్యప్రతిష్ఠానాః తస్మాత్ సత్యపరో భవేత్ ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే నవోత్తరశతతమస్సర్గః (౧౪వ శ్లోకము)  జాబాలి మహర్షికి సమాధనమిస్తూ సత్యము యొక్క వైభవాన్ని ఇలా వర్ణిస్తున్నాడు శ్రీరాముడు: “దానధర్మములు, యజ్ఞములు, హోమకార్యములు, వ్రతములు, తపస్సులు, వేదములు, మెదలైనవాటన్నిటికి సత్యమే ఆధారము. కావున లోకమంతయు సత్యమునే ఆశ్రయించ వలెను”.

సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా । సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరం పదమ్ ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే నవోత్తరశతతమస్సర్గః (౧౩వ శ్లోకము) జాబాలి మహర్షికి సమాధనమిస్తూ సత్యము యొక్క వైభవాన్ని ఇలా వర్ణిస్తున్నాడు శ్రీరాముడు: “లోకములో సత్యమే భగవత్స్వరూపము. సంపదలన్నీ సత్యమునే ఆధారముగా చేసుకున్నాయి. అంతటికి సత్యమే మూలము. సత్యముకంటే పరమమైనదేదీ లేదు”.

ఋషయశ్చైవ దేవాశ్చ సత్యమేవ హి మేనిరే । సత్యవాదీ హి లోకేస్మిన్ పరమం గచ్ఛతి క్షయమ్ ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే నవోత్తరశతతమస్సర్గః (౧౧వ శ్లోకము) “ఋషులు, దేవతలు, అందరూ సత్యమే మిగుల శ్రేష్ఠమైనదని తలంతురు. లోకములో కూడా ఉన్నతి సత్యపాలనమువల్లనే కలుగును”, అని శ్రీరాముడు జాబాలి మహర్షితో చెప్పెను. సత్యవైభవమును తెలిపే ఈ శ్లోకము చిరస్మరణీయము.