మనోరథో మహాశేష హృదిమే పరివర్తతే । యద్యహం తం మునివరం శుశ్రూషేయమపి స్వయమ్ ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే ఏకాదశస్సర్గః (౩౪వ శ్లోకము) మహాత్ముడైన అగస్త్యమహర్షిని సేవించాలన్నదే తన చిరకాల వాంఛ అని సుతీక్ష్ణమహర్షితో వివరిస్తూ శ్రీరాముడీశ్లోకము చెప్పెను. పరమాత్మయే దర్శించకోరిన మహర్షులు పుట్టిన భారతదేశమునకు జేజేలు.

త్వరామహే వయం ద్రష్టుం కృత్స్నమాశ్రమమణ్డలమ్ । ఋషీణాం పుణ్యశీలానాం దణ్డకారణ్యవాసినామ్ ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే అష్టమస్సర్గః (౬వ శ్లోకము) సుతీక్ష్ణమహర్షికి ఆతిథ్యమిచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపి, ప్రణామముచేసి, ఆయన వద్ద సెలవుతీసుకొంటూ ఈ శ్లోకము చెప్పెను శ్రీరాముడు: “స్వామీ! మేము దండకారణ్యములోనున్న అందరు మహర్షుల పుణ్య ఆశ్రమములు దర్శించుటకై కుతూహలముతో ఉన్నాము”. పుణ్యక్షేత్రములు, తీర్థములు, మహాత్ములను దర్శించుటకై ఎట్టి కుతూహలము ఉండవలెనో మనకి నేర్పుతున్నాడు శ్రీరాముడు. అట్లే పరమాత్మకు తన భక్తులకై పడే ఆరాటముకూడా ఈ శ్లోకముద్వారా తెలుస్తున్నది.

ఆశ్రమం త్వృషివిరహితం ప్రభుః క్షణమపి న విజహౌ స రాఘవః । రాఘవం హి సతతమనుగతాః తాపసాశ్చార్షచరితధృతగుణాః ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే షోడశోత్తరశతతమస్సర్గః (౨౬వ శ్లోకము) ఒక్కక్షణముకూడా శ్రీరాముడు ఋషులను విడిచి, ఋషులు శ్రీరాముని చింతన విడిచి ఉండలేకపోయెడివారు, అని ఈ శ్లోకార్థము. మనము కూడా ఏ వర్ణాశ్రమాలలోనున్నా ఋషులవలె నిరంతరము భగవధ్యానము చేయవలెను. అట్టి భక్తుల యోగక్షేమము శ్రీరాముడే కాపాడును!

పాదుకేత్వభిషిచ్యాథ నన్దిగ్రామేవసత్ తదా । సవాలవ్యజనం ఛత్రం ధారయామాస స స్వయమ్ । భరతశ్శాసనం సర్వం పాదుకాభ్యాం న్యవేదయత్ ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే పఞ్చదశోత్తరశతతమస్సర్గః (౨౫వ శ్లోకము) భరతుడు శ్రీరామ పాదుకలకి పట్టాభిషేకముచేసి, రాజ్యపాలనము నందిగ్రామమునుండే శ్రద్ధాభక్తులతో నడుపుచుండెను. అతడే ప్రేమగా పాదుకలకు వింజామరలు వీచి, ఛత్రము పట్టి సేవించుచుండెను. రాజ్యపాలన విశేషములన్నీ పాదుకలకు నివేదించుచుండెనని ఈ శ్లోకార్థము. నిజమైన భగవద్భక్తి, కర్మయోగము, భరతుని వద్దనే మనము నేర్వాలి!

రథస్థః స హి ధర్మాత్మా భరతో భ్రాతృవత్సలః । నన్దిగ్రామం యయౌ తూర్ణం శిరస్యాధాయ పాదుకే ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే పఞ్చదశోత్తరశతతమస్సర్గః (౧౨వ శ్లోకము) భ్రాతృప్రేమగల భరతుడు, శ్రీరాముని పాదుకలు శిరస్సున ఉంచుకొని నందిగ్రామ ప్రయాణము చేసెను. మనము కూడా భరతునివలె భగవంతుని నెత్తినపెట్టుకొని, ఆయన ఆజ్ఞలైన ధర్మములను శిరోధార్యములుగా పాటించవలెను.

దైన్యపాదపసఙ్ఘేన శోకాయాసాధిశృఞ్గిణా । ప్రమోహానన్తసత్త్వేన సన్తాపౌషధివేణునా ॥

శ్రీమద్రామాయణే అయోధ్యాకాణ్డే పఞ్చాశీతితమస్సర్గః (౧౯-౨౦ శ్లోకములు) శ్రీరామునే ధ్యానిస్తూ, దుఃఖసాగరములో మునిగి ఉన్న భరతుని స్థితిని వర్ణిస్తూ వాల్మీకి ఈ శ్లోకములు చెప్పిరి: “భరతుని దుఃఖమనే పర్వతములో, నిరంతర రామ ధ్యానమే శిలలుగా ఉన్నాయి. ఆతని వేడినిట్టూర్పులే ధాతువులుగా, దైన్యమే వృక్షములుగా, ఆరాటమే శిఖరములుగా, ప్రమోహమే (ఒళ్ళుతెలియనిమైకము) బలమైన జంతువులుగా, సంతాపమే ఓషధులుగా విరజిల్లుతున్నాయి”. పైకి వర్ణనవలె కనిపించే ఈ శ్లోకము ద్వారా భక్తియొక్క ప్రాధ్యాన్యతను, భక్తుని యొక్క బలమును మనకు చూపుతున్నారు వాల్మీకిమహర్షి. భగవంతునికై తపించే…

ఇమామపి హతాం కుబ్జాం యది జానాతి రాఘవః । త్వాం చ మాం చ హి ధర్మాత్మా నాభిభాషిష్యతే ధ్రువమ్ ॥

–శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే అష్టసప్తతితమస్సర్గః (౨౩వ శ్లోకము) తన పన్నాగము పండెనన్న ఆనందంతో, సర్వాలంకారాలు చేసుకొని, కులుకుచూ తిరుగుతున్న కుబ్జను చూసి, దానిని దండిద్దామని భరతుని వద్ద లాక్కువచ్చిన శత్రుఘునితో భరతుడీ అమృతవాక్కులు పలికెను: “(ఇంత ద్రోహానికి ఒడికట్టి, ఇంతమందిని క్షోభపెట్టిన) ఈ కుబ్జ వధార్హురాలే. కానీ మనము ఈమెను శిక్షించినామన్న వార్త శ్రీరామునికి తెలిస్తే, (స్త్రీ, పైగా దాది, అనగా పెంచిన తల్లివంటిది, అయిన కుబ్జను శిక్షించిన మహాపాపము చేసినందుకు) అతడు ఇంక మనతోమాట్లాడడు”. నిజమైన భగవద్భక్తుడు…