కామాద్వా తాత లోభాద్వా మాత్రాతుభ్యమిదం కృతమ్ । న తన్మనసి కర్తవ్యం వర్తితవ్యం చ మాతృవత్ ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే ద్వాదశోత్తరశతతమస్సర్గః (౧౯వ శ్లోకము) తల్లిదండ్రులను ఎల్లప్పుడూ గౌరవభావముతో సేవించవలసినదే అని నిర్దేశిస్తూ శ్రీరాముడు భరతునితో ఈ శ్లోకమును పల్కెను: “నాయనా! భరతా! కైకేయీమాత తీరనికోరికచేగాని, రాజ్యలోభముచేగాని, నీపైగల మమకారముచేగాని, మరేకారణమునకైగాని ఇట్లు చేసినాసరే, దానిని నీవు మనసులో పెట్టుకొనవలదు. నీవు ఆమెను సముచితముగా ఎల్లప్పుడూ గౌరవించుచుండుము”.

యన్మాతాపితరౌ వృత్తం తనయే కురుతః సదా । న సుప్రతికరం తత్తు మాత్రా పిత్రా చ యత్కృతమ్ ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే ఏకాదశోత్తరశతతమస్సర్గః (౯వ శ్లోకము) “తల్లితండ్రులు తమకు చేసినసేవలఋణమును తీర్చుకొనుట ఎంతటి మహనీయుడికీ అసాధ్యము”, అని శ్రీరాముడు వసిష్ఠమహర్షితో చెప్పెను. కాబట్టి శంక్తివంచనలేకుండా నిరంతరము తల్లిదండ్రులను సేవించుటే తనయుల కర్తవ్యము.

పురుషస్యేహ జాతస్య భవన్తి గురవస్త్రయః । ఆచార్య శ్చైవ కాకుత్స్థ పితా మాతా చ రాఘవ ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే ఏకాదశోత్తరశతతమస్సర్గః (౨వ శ్లోకము) “పుట్టిన ప్రతి మనిషికి ముగ్గురు గురువులుంటారు: (కనిపెంచిన కారణముగా) తల్లి, తండ్రి, (జ్ఞానబోధచేసి ఉద్ధరించిన కారణముగా) ఆచార్యుడు. (కావున వారి ముగ్గురిని పరమ గౌరవముతో సేవించవలెను)” అని వసిష్ఠమహర్షి శ్రీరామునికి ఉపదేశించెను.

కామకారో మహాప్రాజ్ఞ! గురూణాం సర్వదానఘ । ఉపపన్నేషు దారేషు పుత్రేషు చ విధీయతే ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే చతురుత్తరశతతమస్సర్గః (౧౮వ శ్లోకము) తనను కాననములకు పంపే సర్వాధికారాలు తండ్రియైన దశరథునికి కలవు అని ప్రామాణికముగా వెళ్ళడిస్తూ శ్రీరాముడు ఈ శ్లోకమును భరతునితో చెప్పెను. “ఓ పాపరహితుడైన బుద్ధిశాలీ! భరతా! గురుస్థానములో నున్న వారికి తమ శిష్యులపై సర్వాధికారములు ఉండును. కావున భార్య భర్తకి, తనయులు తల్లిదండ్రులకి, విద్యార్థి ఆచార్యునికి, విధేయులుగా ఉండవలసినదే”. విధేయత్వమంటే గురువుయొక్క పురుషార్థసాధనమే తమ సాధనగా పెట్టుకొనుట. అందుకనే తండ్రి ఆజ్ఞాపించకపోయినా తండ్రిని సత్యపథముపై నిలబెట్టుటకై శ్రీరాముడు కాననలకు వచ్చెను.…

తాసాం రామః సముత్థాయ జగ్రాహ చరణాన్ శుభాన్ । మాతౄణాం మనుజవ్యాఘ్రః సర్వాసాం సత్యసఙ్గరః ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే త్య్రుత్తరశతతమస్సర్గః (౧౮వ శ్లోకము) “నరశ్రేష్ఠుడు, సత్యసంధుడు, అయిన శ్రీరాముడు మాతృమూర్తులను (దశరథుని రాణులను) చూడగానే తన ఆసనమునుండి లేచి, వారి పవిత్రమైన పాదాలకు వరుసగా ప్రణమిల్లెను”. ఆ తరువాత లక్షణుడు, సీతాదేవి కూడా భక్తిశ్రద్ధలతో వారందరికి మొక్కిరి. సీతారామలక్ష్మణుల వలె మనముకూడా తల్లికి అత్యంత ప్రేమ, గౌరవములు చూపించ వలెను.

సమాప్తవనవాసం మాం అయోధ్యాయాం పరన్తప । కోను శాసిష్యతి పునః తాతే లోకాన్తరం గతే ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే ద్వ్యుత్తరశతతమస్సర్గః (౧౨వ శ్లోకము) దశరథమహారాజు మరణించారన్న పిడుగులాంటి వార్త వినగానే నిలువునా నరికిన చెట్టులాగా దుఃఖముతో కుప్పకూలిపోయాడు శ్రీరాముడు. ఎట్టకేలకు తేరుకొని ఈ శ్లోకము పలికినాడు: “౧౪ ఏళ్ళ వనవాసము తరువాత నేను అయోధ్య చేరితే, ఇక నన్ను శాసించి, నా మంచి చెడ్డలు చూచుకుని, హితవచనములు చెప్పేది ఎవరు?” అని విలపించెను. Independence, individuality, freedom to explore అనే నినాదాలు చేసే నేటి యువతకు శ్రీరాముని ఈ మాటలు మార్గదర్శకములు కావలెను.…

తతో దశాహేతిగతే కృతశౌచో నృపాత్మజః । ద్వాదశేహని సమ్ప్రాప్తే శ్రాద్ధకర్మాణ్యకారయత్ ॥

— శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే సప్తసప్తతితమస్సర్గః (౧వ శ్లోకము) పురోహితోత్తముడైన వసిష్ఠుని ఆదేశముమేరకు శాస్త్రోక్త పద్ధతిలో భరతుడు తన తండ్రిగారైన దశరథునికి ప్రేతకర్మలు నిర్వహించెను. ఈ శ్లోకార్థమేమనగ: “పది దినములు ధరాశయనము మెదలైన శౌచనియమములు యథావిధిగా పాటించిన భరతుడు, ఆ తరువాత శుచియై శ్రాద్ధకర్మలు ప్రారంభించెను”. హైందవమతములో ప్రేతకర్మలకు, శౌచకర్మలకు, మరియు, శ్రాద్ధకర్మలకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నందునే ఈ అంశములను వివరించుటకు వాల్మీకిమహర్షి రెండు సర్గలుకేటాయించెను!