తప్తకాఞ్చనపుష్పాం చ వైడూర్యప్రవరచ్ఛదామ్ । ద్రక్ష్యసే శాల్మలీం తీక్ష్ణాం ఆయసైః కణ్టకైశ్చితామ్ ॥

— శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే త్రిపఞ్చాశస్సర్గః (౨౦వ శ్లోకము) రావనుని హెచ్చరిస్తూ, పరస్త్రీని కామించే ధూర్తుడు పొందే నరకయాతనను ఇలా వివరించినది సీతామాత: “ఓ రావణా! వేడికి ఎర్రగా కాగిన బంగారు పూలు కలదియు, అంతే వేడెక్కిన మణులతో పొదగ బడిన ఆకులు కలదియు, మొనదేలిన ఇనుపముళ్ళు కలదియు అయిన బూరుగుచెట్టు ఆకారపు స్తంభములను కౌగిలించెదవు  (కావున జాగ్రత్త)”.

నదీం వైతరణీం ఘోరాం రుధిరౌఘనివాహినీమ్ । అసిపత్ర వనం చైవ భీమం పశ్యసి రావణ ॥

— శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే త్రిపఞ్చాశస్సర్గః (౧౯వ శ్లోకము) రావనుని హెచ్చరిస్తూ, పరస్త్రీని కామించే ధూర్తుడు పొందే నరకయాతనను ఇలా వివరించినది సీతామాత: “ఓ రావణా! రక్తప్రవాహముతో, అతిదారుణముగా ఉండే వైతరలో పడిపోయెదవు. పదునైన కత్తులే ఆకులుగా ఉండే భయంకరమైన అడవిలో తిరుగాడెదవు (కావున జాగ్రత్త)”.

క్రోశన్తీం రామరామేతి రామేణ రహితాం వనే । జీవితాన్తాయ కేశేషు జగ్రాహాన్తకసన్నిభః ॥

— శ్రీవాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే ద్విపఞ్చాశస్సర్గః (౧౦వ శ్లోకము) కొన ఊపిరితో కొట్టుకుంటున్న తండ్రివంటి జటాయువున పదేపదే అక్కున చేర్చుకుని ఏడువ సాగెను దీనురాలైన సీతాదేవి. ఆమె దుస్స్థిని చూచి కూడా జాలపడక, ఆమెను ఎత్తుకు పోవడాని దగ్గరకు వచ్చెను క్రూరుడైన రావణుడు. అప్పుడు “హా రామా! హా రామా! అని బిగ్గరగా ఏడుస్తూ ఉన్న ఒంటరి సీతను, చావు దగ్గర పడ్డ రావణుడు జుట్టు పట్టుకొని ఈడ్చ సాగెను”. స్త్రీ సదా పూజ్యురాలు. అందునా పతివ్రతయైన స్త్రీ…

పరదారాభిమర్శాత్ తు నాఽన్యత్ పాపతరం మహత్ ।

— శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్దే అష్టత్రింశస్సర్గః (౩౦వ శ్లోకము) “పరస్త్రీని కాంక్షించుట కంటే మహాపాపము మరి లేదు” అని మారీచుడు రావణుని హెచ్చరించెను. భారతీయులు, స్త్రీ లోని సౌందర్యమును త్రిలోకాలకూ అమ్మైన లలితాత్రిపురసుందరీ యొక్క విభూతిగా భావించి కీర్తింతురు, నమస్కరింతురు.

నాత్ర జీవేన్మృషావాదీ క్రూరో వా యది వా శఠః । నృశంసః కామవృత్తో వా మునిరేష తథావిధః ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే ఏకాదశస్సర్గః (౯౦వ శ్లోకము)  అగస్త్యమహర్షి యొక్క మహిమను లక్ష్మణునికి వివరిస్తూ శ్రీరాముడీ శ్లోకము చెప్పెను:  “అసత్యము పలికేవాడు, కృరుడైనవాడు, వంచకుడు, విచ్చలివిడిగా ప్రవర్తించేవాడు ఈ పవిత్రాశ్రమములో మనలేడు”.  అగస్త్యుని తపశ్శక్తిని కీర్తించుటేకాక, మనకు ఉండకూడని గుణాలనిక్కడ వివరిస్తున్నాడు రాఘవుడు.

త్రీణ్యేవ వ్యసనాన్యత్ర కామజాని భవన్త్యుత । మిథ్యావాక్యం పరమకం తస్మాద్గురుతరావుభౌ । పరదారాభిగమనం వినా వైరం చ రౌద్రతా ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే నవమస్సర్గః (౩వ శ్లోకము) యుక్తాయుక్తములు బాగా తెలిసిన సీతాదేవి తన పతితో ప్రేమగా ఇలా పలికినది: “స్వామీ! ఈ లోకములో కామజములైన వ్యసనములు ముఖ్యముగా మూడు. మెదటిది, మరియు అన్నిటికన్నా ప్రమాదకరమైనది అబద్ధము. పరస్త్రీవ్యామోహము రెండవది. తనకు హానికలిగించని ప్రాణులను కూడా హింసించుట మూడవది”. కాబట్టి మనము ఇట్టి వ్యసనములకు దూరముగానుండవలెను.

అవిషహ్యాతపో యావత్ సూర్యో నాతివిరాజతే । అమార్గేణాగతాం లక్ష్మీం ప్రాప్యేవాన్వయవర్జితః ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే అష్టమస్సర్గః (౮వ శ్లోకము) వేసవికాలములోని తీవ్రమైన సూర్యతాపమునకు ఉపమానమిస్తూ శ్రీరాముడీ శ్లోకములో ఆ తాపమును అవినీతిపరుని అక్రమార్జనతో పోల్చెను! కాబట్టి మనము సర్వార్థసాధకమైన ధనమును ధర్మముతప్పకుండా ఆర్జించవలెను.