అక్షయా నరశార్దూల! మయా లోకా జితాః శుభాః । బ్రాహ్మ్యాశ్చ నాకపృష్ఠ్యాశ్చ ప్రతిగృహ్ణీష్వ మామకాన్ ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే పఞ్చమస్సర్గః (౩౧వ శ్లోకము) మహాతపస్సంపన్నుడు, పరమపుణ్యమూర్తి అయిన శరభంగముని శ్రీరామునితో ఇట్లనెను: “ఓ మహాపురుషా! నా తపశ్శక్తిప్రభావమున అక్షయములైన పుణ్యలోకములు నాకు లభించినవి. ఆ తపఃఫలితాన్నంతటిని నీకు సమర్పించుచున్నాను. స్వీకరింపుము”. ‘కర్మసన్యాసము’ అను పదమునకు నిర్వచనము చెప్పిన శరభంగముని చరిత్ర మనకు మార్గదర్శకము కావలెను! ఆయన అనంతములైన పుణ్యకర్మలను చేసికూడా, వాటి ఫలితమును ఆశించలేదు. ఆ పుణ్యమును భగవదర్పణము చేసి మోక్షమును పొందెను.

పాదుకేత్వభిషిచ్యాథ నన్దిగ్రామేవసత్ తదా । సవాలవ్యజనం ఛత్రం ధారయామాస స స్వయమ్ । భరతశ్శాసనం సర్వం పాదుకాభ్యాం న్యవేదయత్ ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే పఞ్చదశోత్తరశతతమస్సర్గః (౨౫వ శ్లోకము) భరతుడు శ్రీరామ పాదుకలకి పట్టాభిషేకముచేసి, రాజ్యపాలనము నందిగ్రామమునుండే శ్రద్ధాభక్తులతో నడుపుచుండెను. అతడే ప్రేమగా పాదుకలకు వింజామరలు వీచి, ఛత్రము పట్టి సేవించుచుండెను. రాజ్యపాలన విశేషములన్నీ పాదుకలకు నివేదించుచుండెనని ఈ శ్లోకార్థము. నిజమైన భగవద్భక్తి, కర్మయోగము, భరతుని వద్దనే మనము నేర్వాలి!

రాఘవాయ చ సన్న్యాసం దత్త్వేమే వరపాదుకే । రాజ్యం చేదమయోధ్యాం చ ధూతపాపో భవామిచ ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే పఞ్చదశోత్తరశతతమస్సర్గః (౨౦వశ్లోకము) “సర్వరక్షంకరములైన రామపాదుకల ప్రభావముచే ఈ ౧౪ ఏండ్లు రాజ్యపాలనము చేసి, శ్రీరాముడు తిరిగి వచ్చిన పిదప ఆయన నా వద్ద న్యాసంగా ఉంచిన రాజ్యమును, అయోధ్యను (మరియు ఈ పాదుకలను) ఆయనకు తిరిగి ఇస్తాను. అప్పుడు నా పాపములన్ని (రామానుగ్రహమువలన) నిశ్శేషముగా దగ్ధమగును”. ఈ శ్లోకము భగవద్గీతలో స్వామి చెప్పిన చరమశ్లోకమైన “సర్వధర్మాన్పరిత్యజ్య మామేకం శరణం వ్రజ । అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః ॥” కి సరిగ్గా సరిపోతుంది. కాబట్టి…

తవ పాదుకయోర్న్యస్య రాజ్యతన్త్రం పరన్తప ।

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే ద్వాదశోత్తరశతతమస్సర్గః (౨౫వ శ్లోకము) “శ్రీరామా! ఈ పదునాలుగు సంవత్సరములు నీ పాదుకలయందే నేను ఈ రాజ్యమును న్యాసముచేసి, నిమిత్తమాత్రుడనై ధర్మపాలనము చేయుదును”. భగవద్గీతలో శ్రీకృష్ణస్వామి వివరించిన కర్మయోగమును ఉత్తమ ఉదాహరణము భరతుడు అని ఈ శ్లోకము ద్వారా తెలుస్తున్నది. భరతుని వలె మనముకూడా శక్తిప్రదాత భగవంతుడే అన్న ఎరుకతో ఉండి, కర్తవ్యముపై మమకారమును విడిచి, కర్తవ్యపాలనము చేయవలెను.