తర్పయిత్వాథ సలిలైస్తే పితౄన్ దైవతాని చ । స్తువన్తి స్మోదితం సూర్యం దేవతాశ్చ సమాహితాః ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే షోడశస్సర్గః (౪౨వ శ్లోకము) మిక్కిలి చలిగా ఉన్న హేమంత ఋతువు తెల్లవారుఝామున సీతారామలక్ష్మణులు గోదావరినదీ జలములలో స్నానముచేసిరి. “గోదావరీ పుణ్యజలములతో వారు పితృతర్పణములు, దేవతర్పణములు, ఇచ్చిరి. ఉదయించిన సూర్యుని, ఇతరదేవతలను తదేకదృష్టితో ధ్యానించిరి”, అని ఈ శ్లోకార్థము. సీతారామలక్ష్మణుల సదాచారమీశ్లోకము ద్వారా తెలుస్తున్నది. మిక్కిలి చలికాలమైననూ వారు సమయము తప్పక సూర్యోదయాత్పూర్వమే చల్లని నదీ జలములలో స్నానము చేసిరి. పితృదేవతా, దేవతా పూజలు శాస్త్రోక్త పద్ధతిలో చేసిరి. ఆ అడవిప్రాంతములోని చలిని వర్ణిస్తూ వాల్మీకి…

నవాగ్రయణపూజాభిరభ్యర్చ్య పితృదేవతాః । కృతాగ్రయణకాః కాలే సన్తో విగతకల్మషాః ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే షోడశస్సర్గః (౬వ శ్లోకము)  హేమంత ఋతు వర్ణన చేస్తూ లక్ష్మణుడిట్లు శ్రీరామునితో పల్కెను: “సత్పురుషులు నవాగ్రయణపూజ ద్వారా పితృదేవతలను తృప్తి పరచి పాపరహితులగుచున్నారు”. క్రొత్తధాన్యం ఇంటికి వచ్చినప్పుడు, దానిని శాస్త్రోక్త పద్ధతిలో దేవ–పితృకార్యాలకు ప్రప్రథమముగా వినియోగించి (నవాగ్రయణాది ప్రక్రియలద్వారా), మిగిలిన ధాన్యనుము ప్రసాదముగా స్వీకరించుట సనాతన ధర్మమని ఈ శ్లోకము ద్వారా తెలుస్తున్నది. అట్లు నివేదనము చేయక తన తృప్తికై ధాన్యమును ఉపయోగించినచో, ఆ ధాన్యార్జనయందు జరిగే జీవహింసాపాపము యజమానికి అంటునని లక్ష్మణుడు మనకి బోధిస్తున్నాడు.

తతః పుష్పబలిం కృత్వా శాన్తిం చ స యథావిధి । దర్శయామాస రామాయ తదాశ్రమపదం కృతమ్ ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే పఞ్చాదశస్సర్గః (౨౫వ శ్లోకము) అందమైన కుటీరమును నిర్మించిన పిమ్మట, లక్ష్మణుడు పవిత్ర గోదావర్నదిలో స్నానమాచరించి, కొన్ని పద్మములను తీసుకువచ్చెను. శాస్త్రానుసారముగా (వాస్తుపురుష) పూజ, శాంతి, చేసి నివాసయోగ్యమైన ఆ ఆశ్రమును శ్రీరామునికి చూపెనని ఈ శ్లోకార్థము. క్రొత్త ఇంటిలో ప్రవేశించేముందు, శాస్త్రానుసారముగా గృహప్రవేశము చేయవలెను. అడవులలో ఉండవలసి వచ్చినప్పుడుకూడా ఇట్టి వైదికధర్మములను పాటించిన సీతారామలక్ష్మణులు మనకు మార్గదర్శకము కావలెను.

ఉపాస్య పశ్చిమాం సన్ధ్యాం సహభ్రాత్రా యథావిధి । ప్రవివేశాశ్రమపదం తమృషిం సోభ్యవాదయత్ ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే ఏకాదశస్సర్గః (౭౦వ శ్లోకము) సాయంకాలసమయములో అగస్త్యభ్రాతాశ్రమము చేరిన రామలక్ష్మణులు, యథావిధిగా సంధ్యావందనము చేసిన తరువాతనే పవిత్రాశ్రమ ప్రవేశము చేసిరని ఈ శ్లోకార్థము. మనముకూడా (ఉపనయనమైనచో) సకాలములో సన్ధ్యాది ఆహ్నికములు ముగించుకొని శుచిలమైన తరువాతనే పవిత్ర తీర్థక్షేత్రములలోకి ప్రవేశించవలెను.

ప్రదక్షిణం మునిం కృత్వా ప్రస్థాతుముపచక్రమే ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే అష్టమస్సర్గః (౧౭వ శ్లోకము) సుతీక్షణుని ఆశ్రమము నుండి దండకారణ్యమునకు బయలుదేరే ముందు రామలక్ష్మణులు ఆ మహర్షికి ప్రదక్షిణపూర్వకముగా పాదాభివందనము చేసిరని ఈ శ్లోకార్థము. దేవతలకు, మహర్షులకు, దివ్యక్షేత్రతీర్థములకు, ప్రదక్షిణాది నమస్కారములు చేయుట మనకి అనాదిగా వచ్చుచున్న సాంప్రదాయమని చూపే ఈ శ్లోకము చిరస్మరణియము.

కాల్యం విధివదభ్యర్చ్య తపస్విశరణే వనే ।। ఉదయన్తం దినకరం దృష్ట్వా విగతకల్మషాః ।

శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే అష్టమస్సర్గః (౩-౪ శ్లోకములు) సుతీక్ష్ణుని ఆశ్రమములో రాత్రి నివసించిన సీతారామలక్ష్మణులు ఉదయాన్నా సకాలములో నిద్రలేచి, కొలనులో స్నానమాచరించిరి. అప్పుడు సకాలములో విధివిధానపూర్వకముగా ఆహ్నికములు తీర్చుకొని, దేవతార్చనచేసిరి. పిమ్మట ప్రత్యక్షదైవమైన సూర్యభగవానుని దర్శించిరి అని ఈ శ్లోకార్థము. మన సాంప్రదాయానుసారము ఆహ్నికములు, దేవతార్చన సకాలములో చేయుట యొక్క ప్రాధాన్యతను చూపే ఈ శ్లోకము మనకు మార్గదర్శకము కావాలి. సూర్యభగవానుని దర్శనము చేసిన తరువాతనే ఇతర కర్మలు సంకల్పించవలెను.

తతః శుభం తాపసభోజ్యమన్నం స్వయం సుతీక్ష్ణః పురుషర్షభాభ్యామ్ । తాభ్యాం సుసత్కృత్య దదౌ మహాత్మా సన్ధ్యానివృత్తౌ రజనీమవేక్ష్య ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే సప్తమస్సర్గః (౨౪వ శ్లోకము) సీతారామలక్ష్మణులు మరియు సుతీక్ష్ణుడు సాయంకాల సంధ్యోపాసన చేసుకొనిన తరువాత, మహాత్ముడైన సుతీక్ష్ణుడు స్వయముగా ఆదరపూర్వకముగా సీతారామలక్ష్మణులకి అర్ఘ్యపాద్యాదులిచ్చి, సాత్వికాహారము సమర్పించి, సత్కరించెనని ఈ శ్లోకార్థము. సంధ్యావందనాదనాది నిత్యకర్మల ప్రాముఖ్యత, మరియు అతిథిసత్కారము యొక్క ప్రాముఖ్యతను గుర్తుచేసే ఈ శ్లోకము చిరస్మరణీయము.