ద్విజాతివేషేణ సమీక్ష్య మైథిలీ సమాగతం పాత్రకుసుమ్భధారిణమ్ । అశక్యముద్వేష్టుమపాయదర్శనం న్యమన్త్రయద్బ్రాహ్మణవత్ తదాఙ్గనా ॥

— శ్రీమద్వాల్మీకి రామాయణే అరణ్యకాణ్డే షట్చత్వారింశస్సర్గః (౩౪వ శ్లోకము) కపట సన్యాసి వేషము వేసినా, సీతమ్మను చూచిన తరువాత ఆమె అందముతో మత్తెక్కిన రావణుడు తన కామోద్రేకమును ఆపుకోలేక తన దుర్బుద్ధిని బయట పెడుతూ సీతమ్మ అందచందాలను అసభ్యముగా వర్ణిస్తాడు రావణుడు. “అప్పుడు ఆ కపట సన్న్యాసిని తేరిపారచూచి, వచ్చినవాడు దుర్బుద్ధికలవాడని తెలిసినా, వాడు పూజ్యుడైన సన్యాసి వేషములో, పైగా అతిథియై, వచ్చినందుకు నిరాదరణ చేయలేక, యథావిధిగా అర్ఘ్యపాద్యాదులిచ్చినది సీతాదేవి” అని ఈ శ్లోక భావము. ఈ…

అగ్నిం హుత్వా ప్రదాయార్ఘ్యమతిథీన్ ప్రతిపూజ్య చ । వానప్రస్థ్యేన ధర్మేణ స తేషాం భోజనం దదౌ ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే ద్వాదశస్సర్గః (౨౭వ శ్లోకము) అగ్నిహోత్రము (నైవేద్యము, వైస్వదేవము) పూర్తిచేసుకొన్న అగస్త్యుడు అతిథులై వచ్చిన సీతారామలక్ష్మణులకు అర్ఘ్యపాద్యాదులిచ్చి, తన ఆశ్రమధర్మమైన వానప్రస్థానుసారముగా వారికి భోజనము పెట్టెనని ఈ శ్లోకార్థము. అతిథిసత్కారక్రమమీ శ్లోకము ద్వారా బోధిస్తున్నాడు వాల్మీకిమహర్షి. ముందు దేవతా, పితృదేవతారాధనలో భాగమైన అగ్నిహోత్రములు (నైవేద్య, వైస్వదేవములు) ముగించుకొని, ఆ తరువాత నారాయణస్వరూపుడైన అతిథిని అర్ఘ్యపాద్యాదులతో పూజించాలి. తరువాత తన వర్ణాశ్రమ ధర్మాలకనుగుణముగా అతిథులకు భోజనము ఏర్పాటు చేయాలి.

తతః శుభం తాపసభోజ్యమన్నం స్వయం సుతీక్ష్ణః పురుషర్షభాభ్యామ్ । తాభ్యాం సుసత్కృత్య దదౌ మహాత్మా సన్ధ్యానివృత్తౌ రజనీమవేక్ష్య ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే సప్తమస్సర్గః (౨౪వ శ్లోకము) సీతారామలక్ష్మణులు మరియు సుతీక్ష్ణుడు సాయంకాల సంధ్యోపాసన చేసుకొనిన తరువాత, మహాత్ముడైన సుతీక్ష్ణుడు స్వయముగా ఆదరపూర్వకముగా సీతారామలక్ష్మణులకి అర్ఘ్యపాద్యాదులిచ్చి, సాత్వికాహారము సమర్పించి, సత్కరించెనని ఈ శ్లోకార్థము. సంధ్యావందనాదనాది నిత్యకర్మల ప్రాముఖ్యత, మరియు అతిథిసత్కారము యొక్క ప్రాముఖ్యతను గుర్తుచేసే ఈ శ్లోకము చిరస్మరణీయము.

తతో రామస్య సత్కృత్య విధినా పావకోపమాః । ఆజహ్రుస్తే మహాభాగాః సలిలం ధర్మచారిణః ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే ప్రథమోధ్యాయః (౧౫వ శ్లోకము) “ధర్మాచారపరాయణులు, అగ్నితోసమాన తేజస్వులు అయిన (దండకారణ్యములోని) ఋషులు యథావిధిగా సీతారామలక్ష్మణులకు అతిథిసత్కారములను అర్పించిరి” అని ఈ శ్లోకార్థము. తపోదీక్షలోనుండి, ఐహికసుఖాలను త్యజియుండి, త్రికాలవేదులైకూడా తమ విధ్యుక్తధర్మములను విడువని ఈ ఋషులే భారతీయులకు మార్గదర్శకులు. అతిథిపూజనము యొక్క ప్రాధాన్యతకూడా ఈ శ్లోకముద్వారా తెలుస్తున్నది.

స్వయమాతిథ్యమాదిశ్య సర్వమస్య సుసత్కృతమ్ । సౌమిత్రిం చ మహాభాగాం సీతాం చ సమసాన్త్వయత్ ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే సప్తదశోత్తరశతతమస్సర్గః (౬వ శ్లోకము) అత్రిమహాముని స్వయముగా సీతారామలక్ష్మణులకు సకలమైన అతిథిసత్కారములు చేసెను. వారితో అనునయవచనములు పల్కెనని ఈ శ్లోకార్థము. భార్తతీయుల జీవనములో అతిథిసత్కారము యొక్క ప్రాధాన్యత ఈ శ్లోకము ద్వారా తెలుస్తున్నది. మహాతపస్వి, మహర్షి, వచ్చిన అతిథులకు (శ్రీరామాదులకు) గురుస్థానములో ఉండి కూడా, అత్రిమహర్షి అతిథిపూజ చేసెను.