సా తదా సమలఙ్కృత్య సీతా సురసుతోపమా । ప్రణమ్య శిరసా తస్యై రామం త్వభిముఖీ యయౌ ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే ఏకోనవింశోత్తరశతతమస్సర్గః (౧౧వ శ్లోకము) అనసూయాదేవి ప్రేమగా ఇచ్చిన దివ్యవస్త్రాభరణములను ధరించి సీతాదేవి ఆమెకుశిరసా ప్రణమిల్లెనని ఈ శ్లోకార్థము. క్రొత్తబట్టలు కట్టుకొన్న తరువాత పెద్దలకు ప్రణామాలు చేయాలన్ని సాంప్రదాయాన్ని చూపించే ఈ శ్లోకము చిరస్మరణీయము.

దీయమానాం న తు తదా ప్రతిజగ్రాహ రాఘవః । అవిజ్ఞాయ పితుశ్ఛన్దం అయోధ్యాధిపతేః ప్రభోః ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే అష్టాదశోత్తరశతతమస్సర్గః (౫౧వ శ్లోకము) శివధనుస్సును ఎక్కుపెట్టిన శ్రీరాముని చూసి పొంగిపోయి, తన కూతురైన సీతని శ్రీరామునికి ధారపోయుటకు ఉద్యమించెను జనకుడు. అప్పుడు శ్రీరాముడు జనకమహారాజుతో తన తండ్రిగారైన దశరథుని అనుమతి లేనిదే సీతను గ్రహించలేనని చెప్పెనని ఈ శ్లోకార్థము. వివాహాదివిషయాలలో నిర్ణయము తల్లిదండ్రులదేయని తేల్చిచెప్పే రాముని ఈ వచనములు ఇప్పటి యువతకు మార్గదర్శకము కావలెను.

నవీకృతం తు తత్ సర్వం వాక్యైస్తే ధర్మచారిణి । పతిశుశ్రూషణాన్నార్యాః తపో నాన్యద్విధీయతే ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే అష్టదశోత్తరశతతమస్సర్గః (౯వ శ్లోకము) శ్రీరాముని అనుగమించి వచ్చిన సీతను అభినందించి, స్త్రీధర్మాన్ని బోధించిన అనసూయాదేవితో సీత ఇట్లు అద్భుత సమాధానమిచ్చెను: “మా అత్తగారు, అమ్మ, నాకు చేసిన ఉపదేశములు మీరు జ్ఞప్తికి తెచ్చినారు. పతి శుశ్రూషయే స్త్రీకి గొప్ప తపస్సు. దీనిని మించిన తపస్సు స్త్రీకి లేదు”. ఈ శ్లోకము ద్వారా స్త్రీధర్మాలే కాకుండా, మధురము మాటలెలా మాట్లాడాలో సీతాదేవి మనకు నేర్పుతున్నది. లోకములో విషయములు పునశ్చరించినప్పుడు జనులకి ఈ విషము తెలుసుననే హేయభావముండును.…

తదేవమేనం త్వమనువ్రతా సతీ పతివ్రతానాం సమయానువర్తినీ । భవ స్వభర్తుః సహధర్మచారిణీ యశశ్చ ధర్మం చ తతస్సమాప్స్యసి ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే సప్తదశోత్తరశతతమస్సర్గః (౨౭వ శ్లోకము) శ్రీరాముని అనుగమించి వచ్చిన సీతను అభినందించి, స్త్రీధర్మాన్ని బోధించే ఈ అద్భుత శ్లోకమును చెప్పెను అనసూయాదేవి: నీవు పతిసేవనమందే నిమగ్నమైయ్యుండుము. పతివ్రతాధర్మము పాటించుము. నీ భర్తకు సహధర్మచారిణివైయ్యుండుము. ఇదే నీకు కీర్తిని, ఉత్తమ ధర్మఫలమును ఇచ్చును.

దుశ్శీలః కామవృత్తో వా ధనైర్వా పరివర్జితః । స్త్రీణామార్యస్వభావానాం పరమం దైవతం పతిః ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే సప్తదశోత్తరశతతమస్సర్గః (౨౨వ శ్లోకము) శ్రీరాముని అనుగమించి వచ్చిన సీతను అభినందించి, స్త్రీధర్మాన్ని బోధించే ఈ అద్భుత శ్లోకమును చెప్పెను అనసూయాదేవి: “పతి చెడుస్వభావముగలవాడైనను, స్వేచ్ఛాచారియైనను, ధనహీనుడైనను, ఉత్తమ స్త్రీకి అతడే దైవము”.

నగరస్థో వనస్థో వా పాపో వా యది వాశుభః । యాసాం స్త్రీణాం ప్రియో భర్తా తాసాం లోకా మహోదయాః ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే సప్తదశోత్తరశతతమస్సర్గః (౨౧వ శ్లోకము) శ్రీరాముని అనుగమించి వచ్చిన సీతను అభినందించి, స్త్రీధర్మాన్ని బోధించే ఈ అద్భుత శ్లోకమును చెప్పెను అనసూయాదేవి: “తన భర్త నగరమునందున్నను, వనములపాలైనను, సన్మార్గుడై నను, దుర్మార్గుడైనను, అతనిని ప్రమతో అనుగమించుట వలనే స్త్రీకి సద్గతులు ప్రాప్తిస్తాయి”.

తామిమాం సర్వభూతానాం నమస్కార్యాం యశస్వినీమ్ । అభిగచ్ఛతు వైదేహీ వృద్ధామక్రోధనాం సదా । అనసూయేతి యా లోకే కర్మభిః ఖ్యాతిమాగతా ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే సప్తదశోత్తరశతతమస్సర్గః (౧౨వ శ్లోకము) అత్రిమహర్షి అనసూయాదేవి యోక్క ఔన్నత్యము, తపశ్శక్తి, గూర్చి సీతారాములకు వివరిస్తూ ఈ శ్లోకము చెప్పెను: “(ఒకసారి ముల్లోకములలో పది సంవత్సరముల క్షామమేర్పడినది. అప్పడు అనసూయాదేవి తన తపశ్శక్తితో ఫలమూలములు, గంగను సృష్టించి కాపాడెను. అందుకని) ఈమె ముల్లోకములలోని సర్వభూతములకు పూజ్యురాలు. ఈమె క్రోధమును జయించిన పరమ శాంతమూర్తి. తన సత్కర్మలద్వారా ‘అనసూయ’ (అంటే అసూయ లేనిది) అని పేరు సంపాదించుకొన్నది.” భరతజాతిలో స్త్రీ యొక్క ఔన్నత్యమును చాటే అనసూయాదేవి వంటి సాధ్వీమణులు…

స్వయమాతిథ్యమాదిశ్య సర్వమస్య సుసత్కృతమ్ । సౌమిత్రిం చ మహాభాగాం సీతాం చ సమసాన్త్వయత్ ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే సప్తదశోత్తరశతతమస్సర్గః (౬వ శ్లోకము) అత్రిమహాముని స్వయముగా సీతారామలక్ష్మణులకు సకలమైన అతిథిసత్కారములు చేసెను. వారితో అనునయవచనములు పల్కెనని ఈ శ్లోకార్థము. భార్తతీయుల జీవనములో అతిథిసత్కారము యొక్క ప్రాధాన్యత ఈ శ్లోకము ద్వారా తెలుస్తున్నది. మహాతపస్వి, మహర్షి, వచ్చిన అతిథులకు (శ్రీరామాదులకు) గురుస్థానములో ఉండి కూడా, అత్రిమహర్షి అతిథిపూజ చేసెను.

ఆశ్రమం త్వృషివిరహితం ప్రభుః క్షణమపి న విజహౌ స రాఘవః । రాఘవం హి సతతమనుగతాః తాపసాశ్చార్షచరితధృతగుణాః ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే షోడశోత్తరశతతమస్సర్గః (౨౬వ శ్లోకము) ఒక్కక్షణముకూడా శ్రీరాముడు ఋషులను విడిచి, ఋషులు శ్రీరాముని చింతన విడిచి ఉండలేకపోయెడివారు, అని ఈ శ్లోకార్థము. మనము కూడా ఏ వర్ణాశ్రమాలలోనున్నా ఋషులవలె నిరంతరము భగవధ్యానము చేయవలెను. అట్టి భక్తుల యోగక్షేమము శ్రీరాముడే కాపాడును!

తేషామౌత్సుక్యమాలక్ష్య రామస్త్వాత్మని శఙ్కితః । కృతాఞ్జలిరువాచేదమ్ ఋషిం కులపతిం తతః ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే షోడశోత్తరశతతమస్సర్గః (౪వ శ్లోకము) ఒకనాడు శ్రీరాముడు చిత్రకూటము వద్ద నివసించు మునులలో ఆందోళనను వారి ముఖకవళికల ద్వారా గమనించెను. సాధుల కష్టములు చూడలేని ఆతడు, ఆందోళనకు కారమేమని ఆలోచించి, ప్రప్రథమముగా తనే తెలియ కారణము కాదు కదా? అని ఆత్మశంకచేసుకొనెనని ఈ శ్లోకార్థము. ఆత్మవిచారణ బహు ఉత్తమగుణము. ఇది మనము శ్రీరాముని వద్ద నేర్వవలెను. అతడి పరధార్మికుడైయ్యుండి కూడా, రాజైకూడా, మెట్టమొదట తనను తానే శంకించుకొనెను!