అనాగతవిధానం తు కర్తవ్యం శుభమిచ్ఛతా । ఆపదం శఙ్కమానేన పురుషేణ విపశ్చితా ॥

— శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే చతుర్వింశ్శస్సర్గః (౧౧వ శ్లోకము) దుశ్శకునములను గమనించిన శ్రీరాముడు లక్ష్మణునితో ఇట్లనెను: “శుభములను కోరుకొనెడి దూరదర్శి తనకెదురగు ఆపదలను ఊహించి, రాబోవు అనర్థములకు తగిన ప్రతిక్రియ చేయవలెను”.  అప్పుడు శ్రీరాముడు రాబోయే ఖరదూషణ యుద్ధమును ఊహించి, తగిన జాగ్రత్తలు, సన్నాహములు చేసెను. మనముకూడా శ్రీరామునివలె ఎల్లప్పుడు అప్రమత్తులమై ఉండవలెను, అని నీతి.

తర్పయిత్వాథ సలిలైస్తే పితౄన్ దైవతాని చ । స్తువన్తి స్మోదితం సూర్యం దేవతాశ్చ సమాహితాః ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే షోడశస్సర్గః (౪౨వ శ్లోకము) మిక్కిలి చలిగా ఉన్న హేమంత ఋతువు తెల్లవారుఝామున సీతారామలక్ష్మణులు గోదావరినదీ జలములలో స్నానముచేసిరి. “గోదావరీ పుణ్యజలములతో వారు పితృతర్పణములు, దేవతర్పణములు, ఇచ్చిరి. ఉదయించిన సూర్యుని, ఇతరదేవతలను తదేకదృష్టితో ధ్యానించిరి”, అని ఈ శ్లోకార్థము. సీతారామలక్ష్మణుల సదాచారమీశ్లోకము ద్వారా తెలుస్తున్నది. మిక్కిలి చలికాలమైననూ వారు సమయము తప్పక సూర్యోదయాత్పూర్వమే చల్లని నదీ జలములలో స్నానము చేసిరి. పితృదేవతా, దేవతా పూజలు శాస్త్రోక్త పద్ధతిలో చేసిరి. ఆ అడవిప్రాంతములోని చలిని వర్ణిస్తూ వాల్మీకి…

నవాగ్రయణపూజాభిరభ్యర్చ్య పితృదేవతాః । కృతాగ్రయణకాః కాలే సన్తో విగతకల్మషాః ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే షోడశస్సర్గః (౬వ శ్లోకము)  హేమంత ఋతు వర్ణన చేస్తూ లక్ష్మణుడిట్లు శ్రీరామునితో పల్కెను: “సత్పురుషులు నవాగ్రయణపూజ ద్వారా పితృదేవతలను తృప్తి పరచి పాపరహితులగుచున్నారు”. క్రొత్తధాన్యం ఇంటికి వచ్చినప్పుడు, దానిని శాస్త్రోక్త పద్ధతిలో దేవ–పితృకార్యాలకు ప్రప్రథమముగా వినియోగించి (నవాగ్రయణాది ప్రక్రియలద్వారా), మిగిలిన ధాన్యనుము ప్రసాదముగా స్వీకరించుట సనాతన ధర్మమని ఈ శ్లోకము ద్వారా తెలుస్తున్నది. అట్లు నివేదనము చేయక తన తృప్తికై ధాన్యమును ఉపయోగించినచో, ఆ ధాన్యార్జనయందు జరిగే జీవహింసాపాపము యజమానికి అంటునని లక్ష్మణుడు మనకి బోధిస్తున్నాడు.

భావజ్ఞేన కృతజ్ఞేన ధర్మజ్ఞేన చ లక్ష్మణ । త్వయా నాథేన ధర్మాత్మా న సంవృతః పితా మమ ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే పఞ్చాదశస్సర్గః (౨౯వ శ్లోకము)  “ధర్మజ్ఞుడివి, కృతజ్ఞుడివి, అయిన ఓ లక్ష్మణ, నా మనసులోని భావములను సైతం గ్రహించి, నన్ను రక్షించే నీవుండగా, నా తండ్రి దశరథుడు మరణించనట్టే నేను భావిస్తాను”. లక్ష్మణుని సేవాధర్మము తో పాటు, శ్రీరాముని భ్రాతృప్రీతి కూడా ఈ శ్లోకము ద్వారా తెలుస్తున్నది.

తతః పుష్పబలిం కృత్వా శాన్తిం చ స యథావిధి । దర్శయామాస రామాయ తదాశ్రమపదం కృతమ్ ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే పఞ్చాదశస్సర్గః (౨౫వ శ్లోకము) అందమైన కుటీరమును నిర్మించిన పిమ్మట, లక్ష్మణుడు పవిత్ర గోదావర్నదిలో స్నానమాచరించి, కొన్ని పద్మములను తీసుకువచ్చెను. శాస్త్రానుసారముగా (వాస్తుపురుష) పూజ, శాంతి, చేసి నివాసయోగ్యమైన ఆ ఆశ్రమును శ్రీరామునికి చూపెనని ఈ శ్లోకార్థము. క్రొత్త ఇంటిలో ప్రవేశించేముందు, శాస్త్రానుసారముగా గృహప్రవేశము చేయవలెను. అడవులలో ఉండవలసి వచ్చినప్పుడుకూడా ఇట్టి వైదికధర్మములను పాటించిన సీతారామలక్ష్మణులు మనకు మార్గదర్శకము కావలెను.

పరవానస్మి కాకుత్స్థ త్వయి వర్షశతం స్థితే । స్వయం తు రుచిరే దేశే క్రియతామితి మాం వద ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే పఞ్చాదశస్సర్గః (౭వ శ్లోకము) పంచవటి ప్రదేశమునకు చేరిన తరువాత పుష్కళముగా సమిధలు, పుష్పములు, కుశలు, నీళ్ళు (మొదలైన పూజాసామాగ్రి) దొరికే ప్రదేశములో కుటీరము నిర్మించవలెననుకొనెను శ్రీరాముడు. కుటీర నిర్మాణమునకు అనువైన ప్రదేశమును ఎంచుమని బుద్ధిశాలియైన లక్ష్మణునికి చెప్పెను శ్రీరాముడు. అప్పుడు లక్ష్మణుడు ఈ ధార్మికవాక్కులను పల్కెను: “ఓ రామా! ఎన్ని వందల సంవత్సరములు గడిచిననూ (నేనెంత పేద్దవాడనైననూ) నేను నీకు అధీనుడనే. కావున నీవే స్థల నిర్ణయము చేసి, కుటీరనిర్మాణము చేయుమని నన్నాజ్ఙాపించుము”. ఆదర్శ…

యథైషా రమతే రామ ఇహ సీతా తథా కురు । దుష్కరం కృతవత్యేషా వనే త్వామనుగచ్ఛతీ ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే త్రయోదశస్సర్గః (౪వ శ్లోకము) భగవంతుడైన అగస్త్యుడు శ్రీరామునితో ఇట్లనెను: “శ్రీరామా! ఈ సీతాదేవి నిన్ను అనుగమించి అడవులకు రావడమన్న దుష్కరకార్యము సాధించి స్త్రీలోకానికే తలమాణికమైనది. ఇట్టి సాధ్విని సుఖపెట్టుట నీ కర్తవ్యను. ఆమెకేది ఇష్టమో అదే చేయి”. అనుకూలవతియైన భార్యను భర్త ఎంత ప్రేమానురాగములతో చూచుకోవాలో ఈ శ్లోకము ద్వారా అగస్త్యుడు మనకు ఉపదేశిస్తున్నాడు. ఇట్టి ఉన్నతాదర్శాలను బోధించే భారతీయతకు జేజేలు.