తర్పయిత్వాథ సలిలైస్తే పితౄన్ దైవతాని చ । స్తువన్తి స్మోదితం సూర్యం దేవతాశ్చ సమాహితాః ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే షోడశస్సర్గః (౪౨వ శ్లోకము)

మిక్కిలి చలిగా ఉన్న హేమంత ఋతువు తెల్లవారుఝామున సీతారామలక్ష్మణులు గోదావరినదీ జలములలో స్నానముచేసిరి.

“గోదావరీ పుణ్యజలములతో వారు పితృతర్పణములు, దేవతర్పణములు, ఇచ్చిరి. ఉదయించిన సూర్యుని, ఇతరదేవతలను తదేకదృష్టితో ధ్యానించిరి”, అని ఈ శ్లోకార్థము.

సీతారామలక్ష్మణుల సదాచారమీశ్లోకము ద్వారా తెలుస్తున్నది. మిక్కిలి చలికాలమైననూ వారు సమయము తప్పక సూర్యోదయాత్పూర్వమే చల్లని నదీ జలములలో స్నానము చేసిరి. పితృదేవతా, దేవతా పూజలు శాస్త్రోక్త పద్ధతిలో చేసిరి. ఆ అడవిప్రాంతములోని చలిని వర్ణిస్తూ వాల్మీకి మహర్షి అంటారు: “దాహముతో ఉన్న ఏనుగులు తొండములు నీటిలోకి పెట్టుటకు భయపడి దాహార్తిని ఓర్చుకుంటున్నవి”. ఇట్టి తీవ్రవ్యతిరేక పరిస్థితులలో కూడా ధర్మాచరణమును కొంచెముకూడా తప్పని సీతారామలక్ష్మణులు మనకు ఆదర్శము.

Advertisements