తతస్స రౌద్రేభిరతః ప్రమత్తోధర్మకర్శితః । తస్య శస్త్రస్య సంవాసాత్ జగామ నరకం మునిః ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే నవమస్సర్గః (౨౨వ శ్లోకము)

దుష్టసాంగత్యదోషముగురించి వివరిస్తూ సీతాదేవి శ్రీరామునికి కథ వినిపించెను:

ఒక మహాతపస్వి యొక్క యోగ్యతను పరిశీలించ దలచిన దేవేంద్రుడు, అతనికి దర్శనమిచ్చి ఒక కత్తిని తన వద్ద న్యాసముగా భద్రపరచమని ఇచ్చెను. తపస్వి దేవేంద్రుని ఆజ్ఞానుసారము కత్తిని కాపాడుకొంటూవచ్చెను. కానీ క్రమక్రమముగా కత్తియొక్క రక్షణమునే ప్రధాలక్ష్యముగా చేసికొని దానినే ధ్యానించసాగెను.

అప్పుడు శస్త్రము యొక్క సాంగత్యము వలన తపస్వి తపస్సుకు దూరమై, హింసాకృత్యములు చేసి, నరకమునకు పోయెను.

కథ ద్వారా మనము నేర్వవలసిన నీతులు:

  1. సాంగత్యము యొక్క బలమైన ప్రభావము కథ ద్వారా తెలుస్తున్నది. కాబట్టి మనము మన కర్తవ్యమునకు అనువైన వస్తువులతోనే సంపర్కముంచవలెను. ఉదాహరణకు కత్తితో సంపర్కము క్షత్రియునకు మంచిదే, కానీ తపస్వికి అదే దోషము.
  2. ఒక మనిషికి ఎన్నో కర్తవ్యాలు ఉంటాయి. ఉదాహరణకు తపస్వికి, తపస్సు, స్వాధ్యాయము, ముఖ్య కర్తవ్యములు. అట్లే ఇంద్రుడిచ్చిన (కత్తిని రక్షించుట) అనే పనికూడా కర్తవ్యమే. మీదుమిక్కిలి కొన్నిసార్లు పరస్పరవిరుద్ధములైన కర్తవ్యములు సాధించవలసి వస్తుంది. ఉదాహరణకు తపస్సులో భగవంతుని ధ్యానించాలి. అదే సమయములో ఏమరపాటు లేకుండా కత్తినీ భద్రపరచాలి కావున దానినీ ధ్యాసలో ఉంచాలి. ఇట్టి విరుద్ధములైన కర్తవ్యములను సమన్వయ పరచలేక నరకముచేరెను తపస్వి. అట్లుకాక తపస్విధర్మాన్ని, క్షాత్రధర్మాన్ని బాగా సమన్వయ పరచుకొన్న శ్రీరాముడు అరణ్యములో రెండు ధర్మాలనూ పాటించి మనకు ఆదర్శముగా నిల్చెను.
Advertisements