స దృష్ట్వా రాఘవః శ్రీమాన్ తాపసాశ్రమమణ్డలమ్ । అభ్యగచ్ఛన్ మహాతేజా విజ్యం కృత్వా మహద్ధనుః ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే ప్రథమోధ్యాయః (౯వ శ్లోకము)

దండకారణ్యలో ఒక తాపసాశ్రమసముదాయము శ్రీరామునికి కానవచ్చెను. అవి దర్భలు, స్రుక్కు, స్రువములు మెదలైన పరమ పవిత్ర వస్తువులతో శోభిల్లుతున్నవి. ఆ ప్రదేశము పక్షుల కలకలారావములతో, బ్రాహ్మణుల వేదఘోషలతో, అప్సరసల నృత్యశబ్దములతో మారుమ్రోగుతున్నది. అచటి మునులందరూ నియతాహారులై, నారచీరలు ధరించి, ప్రశాంతముగా ఉండిరి. వారితపఃప్రభావముచే అచటి జంతుజాలములుకూడా హింసాప్రవృత్తిని వదలి ప్రశాంతముగ ఉన్నవి.

ఇట్టి పవిత్రాశ్రముల కడకు వెళ్ళేముందు, తన వింటి అల్లెత్రాడును విప్పివేసి ప్రాంగణములోనికి ప్రవేశించెను రాఘవుడని ఈ శ్లోకార్థము.

మనము కూడా తీర్థ, క్షేత్రముల సందర్శనచేయువేళ హింసాప్రవృత్తిని పూర్తిగా విడిచి, శుచులమై ఉండాలని ఈ శ్లోకము ద్వారా వాల్మీకిమహర్షి మనకి చెప్పకనే చెపుతున్నారు.

Advertisements