కాయేన కురుతే పాపం మనసా సమ్ప్రధార్య చ । అనృతం జిహ్వయా చాహ త్రివిధం కర్మపాతకమ్ ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే నవోత్తరశతతమస్సర్గః (౨౧వ శ్లోకము)

జాబాలి మహర్షికి సమాధానమిస్తున్న సందర్భములో శ్రీరాముడీ మధురవాక్సుధను కురిపించెను:

“మనుజుడు పాపకృత్యము చేసినప్పుడు, ఆ పాపకర్మ యొక్క దోషముతో పాటు మరో రెండు దోషములంటును. అవియేమనగా, పాపకృత్యమునకై సంకల్పించిన, ఆలోచించిన దోషము, వాగ్రూపములో దానికై చేసిన అసత్యదషము. ఇలా ఒక్కటే ఐననూ పాపకార్యమునకు దుష్ఫలము మూడింతలగును”.

కాబట్టి మనము పాపకార్యము యొక్క తలంపేసేయరాదని శ్రీరాముని సందేశము. ఎంత ప్రయత్నించిననూ పాపాలోచన పరబాటుగా వస్తే దాన్ని అక్కడే ఆపివేసి, వాక్, కార్య రూపములోకి పరిణమించకుండా చూసుకోవాలి. దురాలోచన వలన వచ్చిన పాపమును దైవ స్మరణ ద్వారా పోగొట్టుకోవాలి. మనో, వాక్, కాయములే త్రికరణములు. వాటిద్వారా ధర్మమును చేస్తే త్రికరణశుద్ధి లభించును. అర్జునివలె, చేసే ప్రతి పనిలో త్రికరణశుద్ధి ఉంటే, ప్రతి పని దైవపూజే అవుతుంది.

Advertisements