దైన్యపాదపసఙ్ఘేన శోకాయాసాధిశృఞ్గిణా । ప్రమోహానన్తసత్త్వేన సన్తాపౌషధివేణునా ॥

శ్రీమద్రామాయణే అయోధ్యాకాణ్డే పఞ్చాశీతితమస్సర్గః (౧౯-౨౦ శ్లోకములు)

శ్రీరామునే ధ్యానిస్తూ, దుఃఖసాగరములో మునిగి ఉన్న భరతుని స్థితిని వర్ణిస్తూ వాల్మీకి ఈ శ్లోకములు చెప్పిరి:

“భరతుని దుఃఖమనే పర్వతములో, నిరంతర రామ ధ్యానమే శిలలుగా ఉన్నాయి. ఆతని వేడినిట్టూర్పులే ధాతువులుగా, దైన్యమే వృక్షములుగా, ఆరాటమే శిఖరములుగా, ప్రమోహమే (ఒళ్ళుతెలియనిమైకము) బలమైన జంతువులుగా, సంతాపమే ఓషధులుగా విరజిల్లుతున్నాయి”.

పైకి వర్ణనవలె కనిపించే ఈ శ్లోకము ద్వారా భక్తియొక్క ప్రాధ్యాన్యతను, భక్తుని యొక్క బలమును మనకు చూపుతున్నారు వాల్మీకిమహర్షి. భగవంతునికై తపించే భరతునివంటి అవ్యాజ భక్తులకు ఈ లక్షణములుండును:

  1. సామాన్యలు పురుషార్థసాధనకై ఇతర మానవులను దేబేరింతురు. భక్తుడు ఇందుకు భిన్నముగా లోకము యెడల ధైర్యమును, భగవంతునియెడల దైన్యము చూపును. భక్తునిలోని ఈ దైన్య గుణమే అతనికి సర్వఫలములను ఇచ్చుననే భావమును ధ్వనింపజేయుటకై వృక్షములతో పోల్చినారు వాల్మీకి.
  2. భగవంతునికై వారుపడే ఆరాటమే వారికి ఉన్నత పదములను ఒసగుననే భావము స్ఫురించుటకై శృంగములతో వాల్మీకి పోల్చిరి.
  3. భక్తి అనే మకరందపు మైకము ఎల్లప్పుడే మునిగియుండే భక్తునికి ఆ మైకమే సర్వవిధములైన రక్ష అని ధ్వనించేలాగా ‘బలసత్త్వేన’ అన్న పద ప్రయోగము చేసిరి వాల్మీకి. ఇందుకు భిన్నముగా, లౌకిక విషయాల మైకములో ఉండే మూర్ఖులకు ఇట్టి మైకమే ప్రమాదకరము అని మనకు తెలిసినదే.
  4. చివరిగా, భగవంతునికై తపిస్తూ, ఆతని వియోగమును భరించలేక భక్తుడు పొందే సంతాపమే ఆ భక్తుని సకల రోగక్లేశములనుండి కాపాడే దివ్యౌషధమని వాల్మీకిమహర్షి సూచన. ఇందుకు భిన్నముగా లౌకికవిషయాలకై పడే సంతాపము మానసిక, శారీరక వ్యాధికారకమని మనకు తెలిసినదే.
Advertisements