ఇమామపి హతాం కుబ్జాం యది జానాతి రాఘవః । త్వాం చ మాం చ హి ధర్మాత్మా నాభిభాషిష్యతే ధ్రువమ్ ॥

–శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే అష్టసప్తతితమస్సర్గః (౨౩వ శ్లోకము)

తన పన్నాగము పండెనన్న ఆనందంతో, సర్వాలంకారాలు చేసుకొని, కులుకుచూ తిరుగుతున్న కుబ్జను చూసి, దానిని దండిద్దామని భరతుని వద్ద లాక్కువచ్చిన శత్రుఘునితో భరతుడీ అమృతవాక్కులు పలికెను:

“(ఇంత ద్రోహానికి ఒడికట్టి, ఇంతమందిని క్షోభపెట్టిన) ఈ కుబ్జ వధార్హురాలే. కానీ మనము ఈమెను శిక్షించినామన్న వార్త శ్రీరామునికి తెలిస్తే, (స్త్రీ, పైగా దాది, అనగా పెంచిన తల్లివంటిది, అయిన కుబ్జను శిక్షించిన మహాపాపము చేసినందుకు) అతడు ఇంక మనతోమాట్లాడడు”.

నిజమైన భగవద్భక్తుడు పాపపుకార్యము చేయుటకు ఎట్లా జంకుతాడో, భరతుని ప్రవర్తన ద్వారా తెలుస్తున్నది. అంతఃపురవాసులు, రాజ్యప్రజలు, పెదతల్లులు, సోదరుడు, చివరికి తాను, అందరూ ఎంతగానో హర్షించే కార్యము కుబ్జను, తను చేసిన తప్పుకు, శిక్షించుట. ఇంతమంది నుంచి వత్తిడి ఉన్నా, కేవలము భగవంతుడికి (శ్రీరామునికి) ప్రీతికరము కాని పని (అధర్మము) అయినందులకు, భరతుడు ఆ పనిని చేయలేదు. మనముకూడా, తప్పుపని చేసేముందు, ఈ పనిచేస్తే భగవంతుడు మనతో ఇంకమాట్లాడడు, అన్న సద్భయమును పెంచుకుంటే సమాజానికి, మనకు, ఎంతో మేలుచేసిన వాళ్ళమౌతాము. సద్గురువై మనకీ దివ్యబోధచేసిన భరతునికి జేజేలు! జేజేలు! జేజేలు!

Advertisements