నిభృతః సంవృతాకారో గుప్తమన్త్రః సహాయవాన్ । అమోఘక్రోధహర్షశ్చ త్యాగసంయమకాలవిత్ ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే ప్రథమస్సర్గః (౨౩)

శ్రీరామునిలో మరి కోన్ని లౌకిక ప్రపంచమునందు బ్రతుకుటకు మనము నేర్వవలసిన గుణములు ఇలా వున్నవి:

1. నిభృతః — శ్రీరాముడు అణిగి వుండేవాడు. అనగా బాహ్య విషయములకు, అధర్మ విషయములకు, ప్రేరేపితుడు కాడు. నిశ్చల స్వభావము కలవాడు. ఆ నిశ్చల స్వభావమే జీవన్ముక్తికి తోడ్పడునని శంకర భగవత్పాదుల వారి భజగోవింద స్తోత్రము కూడ చెబుతున్నది. అదియే “సత్సంగత్వే నిస్సంగత్వమ్, నిస్సంగత్వే నిర్మోహత్వమ్, నిర్మోహత్వే నిశ్చలతత్వమ్, నిశ్చలతత్వే జీవన్ముక్తిః”.

2. సంవృతాకారో — అనగా కప్పబడిన ఆకారము కలవాడు. అంటే, లోపలి భావమును ముఖ వికారాదులచే పైకి తెలియనీయని వాడు. రాజుకి ఈ లక్షణము చాలా ముఖ్యగుణము. అయితే మరి ఇది, అలోచించగా, బ్రాహ్మణ ధర్మము కాదని తెలియుచున్నది. ఎందుకనగా, బ్రాహ్మణులకు ఆర్జవము చాలా అవసరము. ఆర్జవము అనగా లోపల వున్నదే పైకి చెప్పుట.

3. గుప్తమన్త్రః — అనగా ఆలోచనలను రహస్యముగా నుంచు వాడు. దీనినే చాణక్యుని అర్థశాస్త్రము కూడ బోధించుచున్నది. కాబట్టి ఇది రాజుకు కావలిసిన గుణము.

4. సహాయవాన్ — ఇతరులకు సహాయము చేయు స్వభావము కలవాడు.

5. అమోఘక్రోధహర్షశ్చ — పైన వివరించిన గుణములుండుట వలన శ్రీరాముడు “అమోఘక్రోధహర్షశ్చ“, అంటే, వ్యర్ధములు గాని క్రోధ హర్షములు కల వాడు అయ్యెను. వాల్మీకిమహర్షి మరియొక శ్లోకముద్వారా శ్రీరాముడు శిక్షార్హుని దండించు సమయముననే కోపము తెప్పించుకొనును కానీ అన్య సమయములలో కోపములేక శాంతముగా ఉండునని స్పష్టపరిచిరి. కాబట్టి ”అమోఘక్రోధః” అనే శబ్దము శ్రీరాముని యొక్క దుష్టశిక్షణా ప్రతిజ్ఞ యొక్క సత్యమునే చాటుచున్నది. అంతేకాక, శ్రీరాముడు తనకు ఇష్టమైన వస్తువులను, తన సంతోషాలను ఇతరులతో పంచుకునేవాడని వాల్మీకి మహర్షి మరియొక సందర్భములో చెప్పియున్నారు. కాబట్టి ”అమోఘహర్షః” అనే శబ్దముచే శిష్టరక్షణ, మరియు ఆర్తత్రాయపరాయణత్వమే స్ఫురించుచున్నవి. దుష్టశిక్షణ, శిష్టరక్షణ పరమాత్మ యొక్క దివ్య గుణములు.

6. త్యాగసంయమకాలవిత్ — అనగా, ఎప్పుడు దానము చేయవలెనో, ఎప్పుడు చేయరాదో, బాగుగా తెలిసిన వాడు. అనగా, ఇతరుల అర్హతను బట్టి దానము చేయువాడు అని అర్థము. అపాత్ర దానము కూడా పాపమే అన్న సూత్రాన్ని ఇక్కడ బోధిస్తున్నాడు శ్రీరాముడు. అంతే కాక పైన చెప్పిన లక్షణమునకు అన్వయిస్తే — దుష్టులను రక్షించుట కానీ లేదా క్షమించుట కానీ లేదా శిష్టులను శిక్షించుట కానీ వంటి అపాత్రమైన పనులు ఎప్పుడూ చేయని వాడు, అని చెప్పుకొనవచ్చును. అయోధ్యాకాణ్డలోని ద్వితియసర్గములోని ౪౭వ శ్లోకములో కూడా ఈ ౫,౬ సూత్రాలనే వివరించినారు వాల్మీకిమహర్షి.

ఇలా శ్రీరామునిలో ఏన్నో మంచి గుణములు మనకు ఆదర్శప్రాయము అగుచున్నవి.

-శ్రీరామ రామ రామ-