బ్రహ్మణస్స వచః శ్రుత్వా సర్వలోకేశ్వరస్య హ । న విషణ్ణో న సంతుష్టో విశ్వామిత్రస్తపోధనః ॥

— శ్రీమద్వాల్మీకిరామాయణే బాలకాణ్డే త్రిషష్టితమస్సర్గః (౧౯)

విశ్వామిత్రుడు ఒక ధార్మికమైన మహారాజుగా సాధనమొదలు పెట్టి, తీవ్రమైన తపస్సుచే క్రమముగా ధనుర్వేదమంతయూ ఔపాసన పట్టి, రాజర్షియై, తరువాత మహర్షి అయ్యెను. పిదప ఆయన కౌశికీనదీ తీరమున ఇంద్రియనిగ్రహమునకై వెయ్యేండ్లు ఘోరతపమాచరించెను. ఆ తపస్సుకు మెచ్చి దేవతలతో కలిసి లోకేశ్వరుడైన బ్రహ్మదేవుడు సాక్షాత్కరించి “నీవు ఋషులలోకెల్లా శ్రేష్ఠుడవు కావున, నీకు మహర్షిత్వమును ఒసంగుతున్నాను”, అని వరమిచ్చెను. ఆ వచనములను వినిన విశ్వామిత్రులవారు పొంగిపోలేదు అలాగని క్రుంగిపోలేదు, అని శతానందమహర్షి ఈ శ్లోకముద్వారా రామలక్ష్మణులకు విశ్వామిత్రుని మాహాత్మ్యమును వివరించెను. తనకు లభించిన మహర్షి పదవిని గురించి ఆలోచించి గర్వించక, తన ధ్యేయమైన ఇంద్రియనిగ్రహము తనకి కలిగినట్టేనా? అని బ్రహ్మదేవుని ప్రశ్నించెను. దానికి ఆ బ్రహ్మదేవుడు, ఇంకనూ సాధన చేయవలెనని హితవుచెప్పెను!

నిజమైన విరాగి లేదా యోగి యొక్క నిర్వచనమును ఈ శ్లోకము మనకు నేర్పుతున్నది. విరాగియైన వాడు నిరంతరమూ కర్మచేసినా, ఆ కర్మఫలితముగా వచ్చిన సుఖదుఃఖములకు చెక్కుచెదరకుండా విశ్వామిత్రునివలె నిలిచియుండును. ఇట్టి స్థితిని కేవలము ఒక్క జీవితకాలములో సాధించిన విశ్వామిత్రులవారు మనందరికి ఆదర్శము కావాలి. అంతేకాక, ఇంద్రియనిగ్రహము ఎంత కఠినమైనదో ఈ కథద్వారా మనకు తెలుస్తున్నది.