క్షమా దానం క్షమా యజ్ఞః క్షమా సత్యం హి పుత్రికాః |క్షమా యశః క్షమా ధర్మః క్షమయా విష్ఠితం జగత్ ||

— వాల్మీకిరామాయణే బాలకాణ్డే త్రయస్త్రింశస్సర్గః (౮)

విశ్వామిత్రుని తాతగారైన కుశనాభుని ౧౦౦ కన్యలపై అనవసరముగా కోపించిన వాయువు వారిని కురూపులుగా మార్చివేస్తాడు. ప్రతిశాపము ఇచ్చే శక్తి ఉండి కూడా వాయువును క్షమించి తిరిగివచ్చిన కన్యలను చూసి తండ్రియైన కుశనాభుడు మురిసిపోతాడు. ఆ సందర్భములో క్షమ యొక్క వైశిష్ట్యాన్ని ఆవిష్కరించే ఈ శ్లోకాన్ని చెప్తాడు. కుశనాభుని సూక్తి మానవకళ్యాణానికి బీజప్రాయమైన సందేశం. ఈ సందర్భములో ఒక వివరము చెప్పవలసినదే: కుశనాభుని కుమార్తెలవలె మనకి ప్రత్యక్షముగా అపకారము చేసిన వారిని క్షమించగలిగే హక్కు మనకున్నది. కానీ పరులకు గాని, దేశనికి గాని అపకారము చేసిన వాడిని క్షమించే హక్కు మనకు లేదు. మీదుమిక్కిలి ప్రజలకు అపకారము చేసే వాడిని క్షమించడం ఒక రాజుకు తగని పని (ఈ శ్లోకమును చూడండి).